పీర్ సాయుబు...

Posted in By Mahy Pallav 9 comments


ఆ రోజు ఆదివారం ఉదయాన్నే జాగింగ్ కెళ్లి నేరుగా జయన్న కేఫ్ కి వచ్చా, 7 గం ల PASSENGER ట్రైన్ 15 నిమిషాలు లేట్ గా నడుస్తుంది ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా జయన్న కేఫ్ లో టీ తాగుతూ,దమ్ము కొట్టే వాళ్ళు దమ్ముకోడుతూ,ఆదివారం స్పెషల్ ఎడిషన్ పేపర్ కోసం వచ్చే వాళ్ళతో సందడి గా వుంది జయన్న యాపారం .నేను నేరుగా లోపలికెళ్ళి ఒక టీ ఆర్డర్ ఇచ్ఛా .రెండు నిమిషాల్లో మంచి యాలకుల వాసనతో పొగలు చిమ్ముతూ టీ టేబుల్ మీదకి వచ్చింది వెంటనే నేను టీ అందుకుని పేపర్ చదవడం మొదలెట్టానుఇంతలో జయన్న రావటం చూసి 
"ఏంటి జయన్న వ్యాపారం మాంచి హుషారుగా వున్నటుంది "అని అన్నాను .ఏమి హుషారులే మీ వ్యాపారం కంటే కాదుగా అని అన్నాడు తనదైన స్టైల్లో.
" పీర్ సాయుబు కనబడలేదే రెండు రోజులనుంచి" అని టీ మాస్టర్ని అడిగాడు జయన్న
"నాకు తెలియదు బాస్" అన్నాడు లేని మర్యాదను తెచ్చుకొని టీ మాస్టర్
"ఏమి పీర్ సాయుబుకి డబ్బులివ్వట్లేదా" అని అడిగా జయన్నను
నన్ను చూసి నవ్వుతు వెళ్ళాడు జయన్న ఆ నవ్వులో ఏదో అర్ధం వుందని నాకు అర్ధమైంది.
టీ తాగి జయన్న కౌంటర్ దగ్గరికెళ్ళి "ఎంటన్న mood off గావున్నావ్ " అని అడిగా
"ఏమి లేదు మహి " అని అన్నాడు
Okay లెక్కలో రాసుకో అని రొటీన్ గా చెప్పే modulation లో చెప్పి, నా బండి స్టార్ట్ చేశా...

ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త leisure గా వున్నా,వెంటనే ఉదయం జరిగిన సీన్ గుర్తొచ్చి"జయన్న ఏమైనా ఫీల్ అయ్యుంటాడ?" అయిన పీర్ సాయుబు రాలేదని జయన్నకి ఎందుకంత బాధ?జయన్నకు పీర్ సాయుబుకి సంబంధం ఏమిటి?అని ఆలోచిస్తుండగా వెంటనే పీర్ సాయుబు గుర్తొచ్చాడు...

బవిరి గడ్డం,తలకు పచ్చగుడ్డ పాగా ,నుదుట మచ్చ ,మెడలో తాయత్తు ,తెల్ల లాల్చీ, గిరకల పైకి కట్టిన గళ్ళ లుంగి ,ఒక భుజానికి జోలె,ఆ జోలెలో నెమలీకల కట్ట(దాంతో అందరి తల పై పెట్టి దీవించేవాడు), ఒక చేత్తో నిప్పుల కుంపటి ,ఒకచేత్తో విసనకర్ర ఇది TOTAL గా మన పీర్ సాయుబు గెటప్ .రోజు ఉదయాన్నే ప్రతి షాప్ కి వెళ్లి సాంబ్రాణి పొగ వేసి వాళ్ళుఇచ్చిన చిల్లరతో జీవనం సాగించేవాడు మన పీర్ సాయుబు .అదికాక మావూళ్లో పీర్ సాయుబు తాయెత్తు అంటే మంచి గిరాకి.ఏ జబ్బొచిన,వొంట్లో నలతగా వున్నా,ముందు పీర్ సాయుబు తాయెత్తుకు డిమాండ్.పీర్ సాయుబు ఏదో మంత్రం వేసిస్తాడు అది కట్టగానే తగ్గిపోతాయి అని పెద్ద పేరు.అలా మన కేఫ్ లో కూడా ఉదయాన్నే సాంబ్రాణి పొగ వేసేవాడు పీర్ సాయుబు.నిత్యం సిగరెట్ పొగలతో నిండి ఉండే మా కేఫ్లో ఉదయాన్నేఅలా సాంబ్రాణి పొగతో పీర్ సాయుబు తిరుగుతుంటే జయన్న తెగ సంబరపడేవాడు.
ఇంతలో రవి కేఫ్ కి రమ్మని ఫోన్ చేసాడు.టైం చూసాను సాయత్రం 5 గంటలు కావస్తుంది,సరే అని నేను లేచి రెడీ అయ్యి కేఫ్ కి బయలుదేరాను.కరెక్ట్ గా మానస హాల్ సెంటర్ లోఎవరిదో ముస్లిం మత పద్దతులతో మృతదేహంతో అంతిమ యాత్ర ఎదురైంది చూడగానే వాళ్ళలో నా చిన్ననాటి ఫ్రెండ్ ఫిరోజ్ వున్నాడు నన్ను చూసి పలకరించాడు నేను బండి ఆపి "ఏంటి సంగతి"అని అడిగా.వాడు చెప్పిన మాట విని గుండె ఆగినంత పనైంది "పీర్ సాయుబు చనిపోయాడు మామ" అని చెప్పాడు.అంతే బండి రోడ్ పక్కన పార్క్ చేసి వెంటనే నేను వాళ్ళతో పాటు నడిచాను అలా నడుస్తూ నడుస్తూ ..నా జ్ఞాపకాల్లోకి....
అసలు పీర్ సాయుబుతో నా అనుబంధం మీకు చెప్పాలి. చిన్నపుడు నాకు పీర్ సాయుబు అంటే హడల్, ఎందుకంటే నేను అన్నం తినకపోయిన,బడికి వెళ్లకపోయినా ,ఇంట్లో గలబ చేసిన మా అమ్మ నాతో చెప్పే డైలాగ్ ఎంటంటే"పీర్ సాయుబు వస్తున్నాడు నిన్ను ఎత్తుకుపోతాడు"అని.అంతే ఇక అన్ని పనులు ఆ భయంతో చేసేవాడిని .అలా నేను ఎపుడైనా మా షాప్ కి వెళ్తే అక్కడ తగిలేవాడు పీర్ సాయుబు .నేను తనను చూసి బిక్కు బిక్కు మంటు దాక్కునేవాడిని.నన్ను చూసి దగ్గరకు తీసుకొని నెమలీక ఒకటి ఇచ్చేవాడు. నెమలీకను చూడంగానే నాకు భయం పోయేది.ఆ నేమలీకను స్కూల్ కి తీసుకెళ్ళి తెగ buildup లు ఇచ్చే వాడిని మా ఫ్రెండ్స్ ముందు .అలా మొదలుయ్యింది మా బందం .ప్రతి రోజు సాయంత్రం తను తెచ్చిన చిల్లర మా షాప్ లో ఇచ్చి నోటు తెసుకేల్లే వాడు. నాకు పీర్ సాయుబుకి మంచి అనుబందం పెరిగింది. నేను పీర్ సాయుబును చూస్తునే వున్నా ఏమి మారల అదే గెటప్,అదే పని.నేను అనుకొనేవాడిని "ఎవరైనా ఏ పనిలోనైన ఒక రూపాయి లాభం ఆశిస్తారు కదా?మరి ఇతను ఏంటి జీవితాన్ని ఇలా గడిపేస్తున్నాడు" అని.పీర్ సాయుబు ఇల్లు మా ఊరి ఇస్లాంపేటలో చిన్న పూరి పాక,ఆ జాగా కూడా వక్ఫు బోర్డు ఆస్తి.పీర్ సాయుబు కి పిల్లలేరు,వున్నది భార్యే .ఉదయాన్నేలేవటం,ప్రతి షాప్ కి వెళ్ళటం, సాంబ్రాణి వేయటం,ఇంటి దగ్గర తాయెత్తులు అమ్మడం ఇలా నాకు తెలిసినప్పటి నుండి జీవితాన్ని గడిపేస్తున్నాడు.

ఆ రోజు డిసెంబర్ 6 1992 అయోధ్య లో బాబ్రీ మసీదు కూల్చివేత....

దేశంలో అన్ని చోట్ల హిందూ ముస్లిం అల్లర్లు.దేశం మత విద్వేషాలతో రగులుతుంది,ఆ సెగ మా ఊరిని కూడా తాకింది .మా ఊర్లో అన్ని షాప్ లు స్వచ్చందంగా ముసివేసారు.మెయిన్ రోడ్ అంతా నిర్మానుషంగా మారాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు.ఇళ్ళలోంచి ఎవ్వరు బయటకు రావట్లేదు...
ఆ రోజు నుంచి పీర్ సాయుబు వారం రోజులు బజారులోకి వెళ్ళలేదు. ఏ ముస్లిం మతస్తుడు కూడా వెళ్ళలేదు .ఎవరి ఇళ్ళలో వారు వున్నారు తినటానికి తిండి లేదు ,కనీసం గంజి తాగుదామంటే నూకలు కూడా లేక పోయే!వారం తరువాత పోలీసులు 144 సెక్షన్ సడలించారు,ఇక నెమ్మదిగా అందరు షాప్ లు తీయడం మొదలుపెట్టారు,అంతా పోలీసు బందోబస్తి ఏ క్షణం ఏమీ జరుగుతుందోనన్న ఆందోళన!అప్పుడు బయలుదేరాడు పీర్ సాయుబు తన నిప్పుల కుంపటి తీస్కోని,జెండాచెట్టు సెంటర్ దగ్గరికి వచ్చేసరికి పది మంది పోలీసులు నిల్చొని వున్నారు,వారిని దాటుకొని వెళ్తుండగా
ఒక కానిస్టేబుల్ అడిగాడు "ఎక్కడికి నవాబ్ గారు చాల హుషారుగా వెళ్తున్నారు?"అని
"బజార్లోకి భాయ్"అన్నాడు పీర్ సాయుబు
"బజారు నిన్ను పిలుస్తోందారా ముసలోడ" అని ఇంకో కానిస్టేబుల్ అందుకున్నాడు.
"ఇప్పటికి ఏడు రోజులైంది భాయ్ ఇంట్లో అన్నం వండి బజార్లో అందరు షాప్ లు తీసారంటే వెళ్తున్నాను" అని అన్నాడు దీనంగా
ఇంతలో inspector కల్పించుకొని "అక్కడ దేశం రగిలి పోతోంది తెలుసా ?" అని అన్నాడు కోపంగా.
"ఇక్కడ మా కడుపులు రగిలి పోతున్నాయి సార్!తిండి తిని వారం రోజులైంది "అని వొనుకుతున్న గొంతుతో చెప్పాడు పీర్ సాయుబు
అయిన సరే"నువ్వు వెళ్ళటానికి వీల్లేదు"అని అన్నాడు inspector
పీర్ సాయుబు వినకుండా ముందుకు వెళ్తున్నాడు
ఇంతలో inspector జీప్ start చేసి"ఎక్కించండిరా వీడ్ని బండి" అని అరిచాడు
పోలీసులు పీర్ సాయుబును పట్టుకున్నారు,అతను గింజుకుంటున్నాడు,ఇంతలో ఒక కానిస్టేబుల్ మూతి మీద ఒక్కటి ఇచ్చాడు అంతే పీర్ సాయుబు రోడ్ మీద పడ్డాడు,చేతిలో వున్నా కుంపటి దూరంగా పడి ముక్కలైంది,నోట్లోనించి ఒకటే రక్తం.లాల్చీ పట్టుకొని ఒక్క ఊపులో జీపు లోకి లాగి జీపును స్టేషన్ వైపు తిప్పారు.అందరు జరిగిన సంఘటనను చూసి భయపడిపోయారు.ఇంతలో ఒకడు"పీర్ సాయుబుని పోలిసోల్లు లోపలేసారు" అని ఇస్లాం పేట అంతా టంకేసి మరి చెప్పాడు.
పీర్ సాయిబు వాళ్ళ భార్యకి తెలిసి నేరుగా ఆ వార్డ్ councellor ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి,అతన్ను station కి తీసుకువెళ్ళింది.
inspector తో మాట్లాడి తన పూచికత్తు పై వదలమని చెప్పి councellor బయలదేరాడు.పీర్ సాయుబు కోసం అంతా వెతికి చూస్తోంది అతని భార్య, ఎక్కడ కనపడలేదు ఏడుస్తూ వుంది లోపల్నించి పీర్ సాయుబును తీసుకువొచ్చారు.పీర్ సాయుబు చాల దిగులుగా వున్నాడు,లాల్చీ అంతా రక్తపు మరకలు,పీర్ సాయుబుని చూసి పెద్దగా ఏడుస్తు కూర్చుంది .స్టేషన్ లో వున్నా పెద్ద వేపచెట్టు దగ్గరకు తీసుకెళ్ళి అరుగు మీద కూర్చొని బార్యని సముదా ఇస్తున్నాడు ఫీర్ సాయుబు .అప్పుడే కొంత మంది రాజకీయ నాయకులు లోపలి కొచ్చారు,వాళ్ళు 20 -30 మంది వుంటారు.అందరు "రామజన్మభూమి" అంటూ నినాదాలు చేస్తున్నారు స్టేషన్ అంతా ఉద్రిక్తంగా మారింది .
వాళ్ళందరూ పీర్ సాయుబుకి తెలిసినవాళ్ళే స్వీట్ అంగడి రఘు,గోల్డ్ ప్యాలస్ కిరణ్,బట్టల కొట్టు సత్యం,అలా చాలామంది.. వీల్లందరి షాప్ లకు రోజు వెళ్లి సాంబ్రాణి వేస్తాడు.
అందరు పీర్ సాయుబుని కోపంగా చూస్తున్నారు.
బట్టల కొట్టు సత్యం "ఏ రా నా కొడకా నువ్వు మా కొట్లల్లో అడుగుపెడితే కాళ్ళు విరగగొడతాం"అన్నాడు కోపంగా
ఆ మాటకు పీర్ సాయుబు మౌనంగా వున్నాడు.
ఇంతలో inspecter సర్ది చెప్పబోయాడు.
స్వీట్ అంగడి రఘు అందుకొని "ఎక్కడ నుంచి వచ్చరురా మీరు మీ బాబర్ ,అక్బర్ ఎక్కడి వాళ్ళు?మా రాముడు గుడి కూల్చి మీ మసీదు కడతారా!ఎంత ధైర్యం!ఇది రామ జన్మభూమి తెలుసా!అని గట్టిగా అరిచాడు.
అప్పుడు పీర్ సాయుబు లేచి అందరికి దణ్ణం పెడుతూ
"అయ్యా!నాకు రాముడు తెలియదు,రాజ్యాలు తెలియదు ,రాజకీయాలు అంతకంటే తెలియదు
నాకు తెలిసిందల్ల నాకు జన్మనిచ్చిన మా అమ్మ ,నాయన
నన్ను కన్న నా వూరు ,ఇక్కడి గాలి ,ఇక్కడి నేల,ఇక్కడి ప్రేమ,
ఇక్కడ మా బతుకు ఇవే నాకు తెలుసు ఇక నాకు బాబర్ తెలియదు అక్బర్ తెలియదు..
నాకు ఏది తెలియదు,ఏది తెలియదు"అంటూపెద్దగా ఏడుస్తూ మట్టిలో కూలబడ్డాడు,అతని భార్య కూడా కూర్చొని ఏడుస్తూ వుంది..
ఎవరి దారిన వారు వెళ్లారు.ఫీర్ సాయుబు అతని భార్య కూడా నెమ్మదిగా ఇంటికి వెళ్లారు.ఇంటి బయట మంచమేసి పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు .
"అందరు నాకు తెలిసిన మనుషులే ,అందరు నన్ను దగ్గరికి తీసిన వారే,మరి ఈ రోజు ఎందుకు నన్ను దూరంగా ఉండమన్నారు?మతం అంటే ఏమిటి?"అని అలా ఆలోచిస్తూ నిద్ర గురించి మరచిపోయాడు.
అలా ఆకాశంలో చంద్రున్ని చూసి అందులో వున్నా మచ్చలాగా మనిషికి వున్న మచ్చ ఇది .అయినా చంద్రునిలో వున్నా మచ్చ ఏమిటో ఎవ్వరికి అర్ధం కాదు,అలాగే ఇవి కూడా నాకు అర్ధం కావు అని అనుకున్నాడు.ఆ రాత్రి నిదరపోలేదు ..అలా చాల రాత్రులు పీర్ సాయుబు కి నిద్దర పట్టడంలేదు ఒకటే ఆలోచనలు...
రోజులు గడుస్తున్నాయి,నెమ్మదిగా పీర్ సాయిబు బజార్లో తిరుగుతున్నాడు.అన్ని షాప్ లు కాదు కొన్నిషాప్ లే అది కూడా వారం లో రెండు రోజులే రాను రాను పీర్ సాయుబు లో మార్పు కనబడుతుంది.బాగా సన్నబడ్డాడు,ముసలితనం కనబడుతుంది. అప్పుడప్పుడు కేఫ్ లో కనపడినప్పుడు పలకరించే వాడిని నన్ను చూసి "ఎంత పెద్దవాడివయ్యవ్ బేటా" అని మురిసిపోతుండే వాడు.

ఇంతలో ఫిరోజ్ "ఏంట్రా ఆలోచిస్తున్నావ్ "అనే సరికి ఈ లోకం లోకి వచ్చా.ముస్లిం పద్దతుల్లో పీర్ సాయుబుకి అని కార్యక్రమాలు జరుగుతున్నాయి.పీర్ సాయుబు దేహాన్ని గుంటలోకి దించారు,అందరు ఏవో నినాదాలు చేసారు.ఆయన జ్ఞాపకార్ధం ఆయన వాడిన నెమలీకల కట్టను అందులో వేయబోయారు.ఇంతలో ఒక నెమలీక ఎగిరి నన్నుతాకింది.సూర్యుడు అస్తమిస్తుండగా ..పీర్ సాయుబుని సమాధి చేసారు...

ఆ నెమలీకను ఇంట్లో భద్రంగా దాచుకున్న .ఇప్పటికి నెమలీకను చూడగానే పీర్ సాయుబు గుర్తొస్తాడు,అలాగే ఒక ప్రశ్న నా ముందుంటుంది.
"మతం అంటే ఏమిటి?"
దీనికి సమాదానం నాకు తెలియదు,దీనికి సమాధానం పీర్ సాయుబు తన జీవితంలో తెలుసుకోలేక పోయాడు ..అవును నిజమే చంద్రునిలో మచ్చలాగా ఈ ప్రశ్న కూడా సమాజానికి పట్టిన మచ్చే ...

                                                                                                          మహిపల్లవ్...